HTML

HTML2

Thursday, January 18, 2018

2018 లో ప‌న్ను ఆదాకు 15 ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాలు


2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను ప‌న్ను ఆదా చేసుకునేందుకు చ‌క్క‌ని పెట్టుబ‌డి ప‌థ‌కాల గురించి అన్వేషిస్తున్నారు. స్మార్ట్ ఇన్వెస్ట‌ర్లు ఉత్త‌మ‌మైన పెట్టుబ‌డి మార్గాల్లో పెట్ట‌డం ద్వారా అటు ప‌న్ను ఆదాతో పాటు ఇటు అధిక రాబ‌డుల‌ను పొందుతున్నారు. సెక్ష‌న్ 80సీ ప‌రిధికి మించి ఉన్న ప‌న్ను ఆదా పెట్టుబ‌డి మార్గాలేమిటి? వేత‌న ఉద్యోగుల‌కు, వ్యాపారుల‌కు ఎలాంటి ప‌న్ను ఆదా ప‌థ‌కాలు అనుకూలం.. 2018లో ఇలాంటి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డ‌మెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువ‌ల్ ఫండ్లు : ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేవి మ్యూచువ‌ల్ ఫండ్లు. ఇందులో సంవ‌త్స‌రానికి రూ. ల‌క్ష‌న్న‌ర దాకా పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ఆదా పొందొచ్చు. ఇత‌ర మ్యూచువ‌ల్ ఫండ్ల మాదిరిగానే వీటి రాబ‌డుల‌కు క‌చ్చిత‌మైన హామీనివ్వ‌లేరు. ఐతే మార్కెట్లు బాగుంటే 12 నుంచి 18శాతం దాకా రాబ‌డులు వ‌చ్చే అవ‌కాశ‌మైతే ఉంది. ఏ ప‌న్ను ఆదా ప‌థ‌కంతో పోల్చి చూసినా ఈఎల్ఎస్ఎస్‌కు అతి త‌క్కువ లాకిన్ పీరియ‌డ్ ఉంది. ఇది కేవ‌లం మూడేళ్లే. ఇన్వెస్ట‌ర్లు డివిడెండ్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌డం ద్వారా లాకిన్ పీరియ‌డ్‌లోనూ రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్‌లో నెల నెలా సిప్ చేయ‌డం వ‌ల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ర‌క్షించుకొని అధిక రాబ‌డులు పొందే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ గ‌మనించాల్సిన విష‌య‌మేమిటంటే ప్ర‌తి నెల సిప్‌కు లాకిన్ పీరియ‌డ్ మూడేళ్లు. ఉదాహ‌ర‌ణ‌కు డిసెంబ‌రు 2017లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేశార‌నుకుందాం. దీని లాకిన్ పీరియ‌డ్ న‌వంబ‌ర్ 2020 దాకా ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ద్వారా వ‌చ్చే రాబ‌డులు ట్యాక్స్ ఫ్రీ. ఎందుకంటే ఇవి ఈక్విటీ విభాగం కిందికి వ‌స్తాయి. మూడేళ్లు పైగా ఇన్వెస్ట్ అయి ఉంటాయి కాబ‌ట్టి పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. కొన్ని టాప్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో... యాక్సిస్ లాంగ్ ట‌ర్మ్ ఈక్విటీ ఫండ్‌, రిల‌య‌న్స్ ట్యాక్స్ సేవ‌ర్ ఫండ్‌, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ట్యాక్స్ సేవ‌ర్ ఫండ్‌లు ఉన్నాయి. 2018-19 కోసం మంచి రాబ‌డినివ్వ‌గ‌లిగే ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాల్లో ఇవి ఒక‌టి. 

2. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌: ఆర్థిక మంత్రిత్వ‌శాఖ చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌తి మూడు నెల‌ల‌కోసారి మారుస్తుంది. పీపీఎఫ్ పై వ‌డ్డీ రేట్లు ఒక‌ప్పుడు బాగా ఉండేవి. కాల‌క్ర‌మేణ త‌గ్గుతూ వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ ఇవి ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాల్లో ఒక‌టి. ప్ర‌స్తుతానికి వార్షికంగా 7.6శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. జ‌న‌వ‌రి 2018 నుంచి ఇది వ‌ర్తించ‌నుంది. మెచ్యూరిటీ గ‌డువు ముగిశాక వ‌చ్చే సొమ్ముపై పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ఉంది. పీపీఎఫ్ ఖాతా లాకిన్ పీరియ‌డ్ 15ఏళ్లు. ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల దాకా పెట్టే పెట్టుబ‌డుల‌కు సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. 3వ ఆర్థిక ఏడాది నుంచి 5వ ఏట వ‌ర‌కు రుణం పొందే వీలుంది. వ‌డ్డీ పైన అద‌నంగా రుణ రేటును 2శాతం విధిస్తారు. ఎన్ఆర్ఐలు పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు అన‌ర్హులు. అక్టోబ‌ర్ 2017లో జారీ అయిన నియ‌మాల ప్ర‌కారం ఎన్ఆర్ఐలు పీపీఎఫ్ ఖాతాను అలాగే కొన‌సాగిస్తే సాధార‌ణ పొదుపు ఖాతాకు వ‌ర్తించే వడ్డీనే జ‌మ‌చేస్తారు. ఒక వ్య‌క్తి హిందూ అవిభాజ్య కుటుంబం త‌ర‌ఫున లేదా వ్య‌క్తుల స‌మూహం త‌ర‌ఫున ఈ ప‌థ‌కం ద్వారా పెట్టుబ‌డి పెట్టేందుకు వీల్లేదు. క‌నీసం రూ.500 పెట్టుబ‌డి, గ‌రిష్టంగా రూ.1.5లక్ష‌లు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఇంత క‌న్నా ఎక్కువ పెడితే ఎటువంటి వ‌డ్డీ జ‌మ‌కాదు. ప్ర‌తి నెలా పీపీఎఫ్‌లో డ‌బ్బు జ‌మ‌చేయ‌వ‌చ్చు. ఐతే ప్ర‌తి నెల 5వ తేదీలోపు ఇన్వెస్ట్ చేస్తే ఆ నెల వ‌డ్డీ జ‌మ అవుతుంది. ఏప్రిల్ 5లోపు రూ.1.5ల‌క్ష‌లు జ‌మ‌చేయ‌గ‌లిగితే ఆర్థిక సంవ‌త్స‌రానికి పూర్తి వ‌డ్డీ జ‌మ అవుతుంది. ఈ విధంగా చేస్తే 15ఏళ్ల వ్య‌వ‌ధిలో మంచి రాబ‌డుల‌ను పొందొచ్చు. 2018లో ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాల్లో పీపీఎఫ్ ఒక‌టి. ప‌న్ను ఆదాతో పాటు రిటైర్‌మెంట్ కోసం నిధి జ‌మ‌చేసుకోవాల‌నుకునేవారికి, పిల్ల‌ల చ‌దువు, పెళ్లిళ్ల కోసం జ‌మచేయాల‌నుకునేవారికి ఇది ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గం. సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డికి, అధిక రాబ‌డికి పీపీఎఫ్ అనుకూలం. 

3. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌: ఇది కేవ‌లం ఆడ‌పిల్ల‌ల సంక్షేమం కోసం ఉద్దేశించింది. ఏటా 8.1శాతం వ‌డ్డీ అందించ‌నుంది. మెచ్యూరిటీ సొమ్ము పూర్తి ప‌న్ను మిన‌హాయింపున‌కు అర్హ‌త సాధిస్తుంది. క‌నీసం రూ.1000 మొద‌లుకొని రూ.1.5ల‌క్ష‌ల దాకా పెట్టుబ‌డి పెట్టొచ్చు. దీని కాల‌వ్య‌వ‌ధి అమ్మాయికి 21ఏళ్లు నిండేవ‌ర‌కు ఉంటుంది. ఐతే ఆలోపు కావాలంటే కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి సొమ్మును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అమ్మాయికి 15ఏళ్లు వ‌చ్చే దాకా డిపాజిట్ల‌కు అనుమ‌తినిస్తారు. 16వ ఏట నుంచి 21ఏళ్ల దాకా డిపాజిట్ చేసేందుకు అనుమ‌తించ‌రు. 

4. ప‌న్ను ఆదానిచ్చే బ్యాంకు ఎఫ్‌డీ ప‌థ‌కాలు: ఇది కాస్త పాత పెట్టుబ‌డి విధానం. సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. గ‌తేడాది పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత వ‌డ్డీ రేట్లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. వ‌డ్డీ రేట్లు 4.5 నుంచి 7 శాతం మ‌ధ్య‌లో ఉన్నాయి. దీనిపై వ‌చ్చే రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అంటే పెట్టుబ‌డిపై మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. వ‌డ్డీపై కాద‌న్న‌మాట‌. ప‌న్ను ఆదానిచ్చే ఎఫ్‌డీల లాకిన్ పీరియ‌డ్ 5ఏళ్లు. కొన్ని బ్యాంకుల వ‌డ్డీ రేట్లు ఇలా ఉన్నాయి... ర‌త్నాక‌ర్ బ్యాంక్ 7.2శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ 7.2శాతం, డీసీబీ బ్యాంక్ 7.1శాతం, క‌రూర్ వైశ్య బ్యాంక్ 7శాతం, ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ 7శాతం ఉన్నాయి. ఇత‌ర పౌరుల‌తో పోలిస్తే సీనియ‌ర్ సిటిజ‌న్స్ కు అర‌శాతం వ‌డ్డీ ఎక్కువే ఇస్తారు. 

5. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌: ఈ ప‌థ‌కం సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు అద్భుతంగా ఉంటుంది. 60ఏళ్లు పై బ‌డిన‌వారికి ఇది అనుకూలం. వార్షికంగా 8.3శాతం వ‌డ్డీ లెక్కించినా... చెల్లించేది మాత్రం మూడు నెల‌ల‌కోసారి. ఈ ప‌థ‌కం కాల‌వ్య‌వ‌ధి 5ఏళ్లు. క‌నీసం రూ.1000డిపాజిట్ చేయ‌వ‌చ్చు. గ‌రిష్టంగా రూ.15ల‌క్ష‌ల దాకా అనుమ‌తిస్తారు. దీని పై వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఒక ఏడాది త‌ర్వాతే ముంద‌స్తు ఖాతా మూసివేత‌కు అనుమ‌తిస్తారు. అదీ 1.5శాతం ఫైన్‌తో... ఇక రెండేళ్ల త‌ర్వాత తీసుకుంటే 1శాతం రుసుము విధిస్తారు. 

6. వాలంట‌రీ ప్రావిడెంట్ ఫండ్‌: ఉద్యోగి త‌న ప్రావిడెంట్ ఖాతాకు జ‌మ‌చేసుకోగ‌లిగే అద‌న‌పు సొమ్మునే వాలంట‌రీ పీఎఫ్ అంటారు. ఇది ఉద్యోగ భ‌విష్య నిధిలో భాగంగా 12శాతం జ‌మ‌చేసేదానికి అద‌నం. వేత‌నంలోని బేసిక్‌, డీఏ లు క‌లిపితే ఎంత ఉంటుందో అంత గ‌రిష్ట సొమ్ము జ‌మ‌చేసుకోవ‌చ్చు. దీనికీ ఈపీఎఫ్ వ‌డ్డీ రేటే వ‌ర్తిస్తుంది. ఈపీఎఫ్ వార్షిక వ‌డ్డీ రేటు ప్ర‌స్తుతానికి 8.65 శాతంగా ఉంది. దీన్ని మ‌రింత త‌గ్గించే యోచ‌న ఉంది. ఈ ఫండ్‌లో పెట్టే పెట్టుబ‌డుల‌ను రిటైర్‌మెంట్ త‌ర్వాతే తీసుకోవ‌చ్చు. ప‌న్ను ఆదా చేసుకునేందుకు ఇది చ‌క్క‌ని ప‌థ‌కం. మెచ్యూరిటీ త‌ర్వాత వ‌చ్చే రాబ‌డులకు ప‌న్ను వ‌ర్తించ‌దు. 

7. కొత్త పింఛ‌ను ప‌థ‌కం (NPS): సెక్ష‌న్ 80సీ ద్వారా 2018లో ప‌న్ను ఆదా కోసం పెట్టుబ‌డి మార్గాల్లో కొత్త పింఛ‌ను ప‌థ‌కం(NPS) స‌రైన ఎంపిక‌. ఎన్‌పీఎస్ రాబ‌డుల్లో వ్య‌త్యాసం ఉంటుంది. గ‌డ‌చిన 5ఏళ్ల‌లో ఎన్నో ఎన్పీఎస్ ఫండ్లు 10 నుంచి 15శాతం దాకా రాబ‌డుల‌ను అందించాయి. మంచి ఎన్‌పీఎస్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే 12 నుంచి 15శాతం దాకా రాబ‌డి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు సైతం అతి త‌క్కువ‌. పెట్టుబ‌డి విలువ‌లో ఇది 0.0009శాతం మాత్ర‌మే. నెల‌కు రూ.500 చొప్పున లేదా ఏడాదికి రూ.6వేల దాకా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఎన్‌పీఎస్‌లో గ‌రిష్ట పెట్టుబ‌డుల‌కు ప‌రిమితి లేదు. ఐతే టైర్ 1 ఖాతాలో రూ.1.5ల‌క్ష‌ల దాకా పెట్టి సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. ఈక్విటీ, బాండ్లు, గిల్ట్ ఫండ్ల‌కు మ‌ధ్య అసెట్ అలోకేష‌న్ చేసుకునేందుకు ఇన్వెస్ట‌ర్ల‌కు అవ‌కాశం ఉంది. మెచ్యూరిటీ సొమ్ముపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఎన్‌పీఎస్‌ను ఆన్‌లైన్, లేదా ఆఫ్‌లైన్‌లో తెర‌వ‌చ్చు 

8. కొత్త పింఛ‌ను ప‌థ‌కం- సెక్ష‌న్ 80CCD సెక్ష‌న్ 80CCD కింద NPS టైర్ 1 ఖాతాలో పెట్టే పెట్టుబ‌డిపై అద‌నంగా రూ.50వేల ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. టైర్ 1 ఖాతాలో పెట్టే సొమ్మును రిటైర్‌మెంట్ దాకా విత్‌డ్రా చేసుకునే వీల్లేదు. అంటే అప్ప‌టిదాకా సొమ్ము లాక్ అయి ఉంటుంది.

9. జాతీయ పొదుపు ప‌త్రాలు (NSC) :నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్ లేదా జాతీయ పొదుపు ప‌త్రాల‌ను పోస్టాఫీసుల్లో జారీచేస్తారు. దీనిపై వ‌డ్డీని భార‌త ప్ర‌భుత్వం చెల్లిస్తుంది. అందుకే ఇది సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డిగా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. 5ఏళ్ల కాల‌వ్య‌వ‌ధితో ఇవి అందుబాటులో ఉన్నాయి. క‌నీసం రూ.500ల‌తో కొన‌చ్చు. ఆ త‌ర్వాత రూ.1000, రూ.5వేలు, రూ.10వేల ప‌త్రాలు ల‌భిస్తాయి. ఇందులో గ‌రిష్టంగా ఎన్ని ప‌త్రాలైనా కొనొచ్చు. వ‌డ్డీ రేట్లు వార్షికంగా 7.6శాతంగా నిర్ణ‌యించారు. వ‌డ్డీని ప్ర‌తి 6నెల‌ల‌కోసారి లెక్కిస్తారు. వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఇది చూపించాల్సి ఉంటుంది. సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5ల‌క్ష‌ల దాకా ప‌న్నుఆదాకోసం క్లెయిం చేసుకోవ‌చ్చు. వ్య‌క్తులు, ఉమ్మ‌డిగా, సంర‌క్ష‌కుల ఆధ్వ‌ర్యంలో మైన‌ర్లు ఈ ప‌త్రాలు తీసుకునేందుకు అర్హులు. 

10. యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌(యూలిప్స్‌) :2010 సంవ‌త్స‌రంలో ఐఆర్‌డీఏ నియ‌మాలు జారీచేశాక బీమా సంస్థ‌లు యూలిప్స్ ఛార్జీల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించేశాయి. జీవితానికి ఇవి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి. కొత్త యూలిప్స్ పాల‌సీల‌కు త‌క్కువ పాల‌సీ లేదా నిర్వ‌హ‌ణ ఛార్జీలున్నాయి. దీంట్లో ఇంత రాబ‌డి వ‌స్తుంద‌ని గ్యారెంటీ లేదు. 5 నుంచి 11శాతం మ‌ధ్య‌లో రాబ‌డిని అందించే అవ‌కాశం ఉంది. 10-12ఏళ్ల కాలంపాటు దీంట్లో ఉంచితే మంచి రాబ‌డుల‌ను చూడ‌వ‌చ్చు. స్టాక్‌మార్కెట్లు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై న‌మ్మ‌కం లేనివారు వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. పెట్టుబ‌డితో పాటు జీవిత ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి ఇవి. సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. 

11. జీవిత బీమా పాల‌సీలు: ఆర్థిక ప్ర‌ణాళిలో మొట్ట‌మొద‌ట చేయాల్సిన ప‌ని జీవిత బీమా తీసుకోవ‌డం. మంచి ట‌ర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. అతి త‌క్కువ ప్రీమియం ఉండేలా ఎక్కువ క‌వ‌రేజీని ఇస్తాయి. పాల‌సీదారు త‌ద‌నంత‌రం త‌న‌పై ఆధార‌ప‌డి బ్ర‌తికేవారికి ఆర్థిక తోడ్పాటు క‌ల్పిస్తాయి. 10 లేదా 15ఏళ్ల వార్షిక ఖ‌ర్చుల‌కు స‌మాన‌మైన ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు చేయ‌డం మంచిది. జీవిత ర‌క్ష‌ణతో పాటు ప‌న్ను ఆదాను ఇవి క‌ల్పిస్తాయి. 

12. గృహ‌రుణ అస‌లు చెల్లింపు: మీ క‌ల‌ల ఇంటిని సొంతం చేసుకోలేదా! అయితే ఇప్పుడే గృహ‌రుణం తీసుకొని ఇల్లు క‌ట్టుకోండి. దాంతో పాటే అస‌లు లేదా ప్రిన్సిప‌ల్ అమౌంట్ తిరిగి చెల్లింపుపై వ‌డ్డీ మిన‌హాయింపు పొందండి. సొంత ఇల్లు లేక‌పోతే ప‌న్ను ఆదా చేసుకునేందుకు చేసే పెట్టుబ‌డి మార్గాల్లో దీనికి ప్రాధాన్య‌త ఇచ్చుకోవ‌చ్చు. 

13. గృహ రుణ వ‌డ్డీ చెల్లింపు :గృహ‌రుణ వ‌డ్డీ చెల్లింపుల‌పై రూ.2ల‌క్ష‌ల దాకా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 24 ఈ వెసులుబాటును క‌ల్పిస్తుంది. సెక్షన్ 80సీ కింద గృహ‌రుణ అస‌లుపై పొందే మిన‌హాయింపున‌కు ఇది అద‌నం. క‌ట్టుకున్న ఇంట్లో నివ‌సించినా, లేదా అద్దెకు ఇచ్చినా ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

14. తొలిసారి ఇంటిని కొనుగోలుచేసేవారికి తొలిసారి ఇంటిని కొనుగోలు చేసేవాళ్ల‌లో మీరూ ఒక‌రైతే గృహ‌రుణ వ‌డ్డీ తిరిగి చెల్లింపుపై అద‌నంగా రూ.50వేల దాకా ప‌న్ను ఆదా పొందొచ్చు. సెక్ష‌న్ 80EE ఈ వెసులుబాటును క‌ల్పిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు మొద‌టిసారి గృహ‌రుణం తీసుకున్న‌వారు ఒక ఏడాదిలో రూ.2.6ల‌క్ష‌ల వ‌డ్డీ చెల్లించార‌నుకుందాం. అప్పుడు సెక్ష‌న్ 24 కింద రూ.2లక్ష‌లు, ఇంకా సెక్ష‌న్ 80EE కింద రూ.50వేలు.. మొత్తంగా రూ.2.5ల‌క్ష‌ల ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. 

15. పింఛ‌ను ప‌థ‌కాలు :ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఇవి ఆదాయం అందిస్తాయి. వీటిలో డిఫర్డ్ యాన్యుటీ, ఇమీడియ‌ట్ యాన్యుటీ అని రెండు ర‌కాలున్నాయి. డిఫ‌ర్డ్ యాన్యుటీ తీసుకుంటే ప‌ద‌వీ విర‌మ‌ణ దాకా పెట్టుబ‌డి పెడుతూ ఉండాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు చేరుకోగానే జ‌మ అయిన మొత్తంలో నుంచి 60శాతం దాకా వెన‌క్కి తీసుకోవ‌చ్చు. మిగ‌తాది యాన్యుటీ ఫండ్‌లో వేయాలి. దీని ద్వారా రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ అందుకోవ‌చ్చు. ఇమీడియ‌ట్ యాన్యుటీలో మాత్రం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబ‌డి పెట్టాలి. త‌రువాతి నెల నుంచి పింఛ‌ను పొందొచ్చు. ఈ రెండు ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఉద్దేశించిన‌వి. ఇవి కాకుండా అద‌నంగా మెడిక‌ల్ ఇన్సూరెన్స్‌, ఇంటి అద్దెపై, పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజుల‌పై ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. 

 పైన పేర్కొన్న టాప్ 15 ప‌న్ను ఆదా ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి ద్వారా సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5ల‌క్ష‌ల దాకా మిన‌హాయింపు పొందొచ్చు. ఎన్‌పీఎస్ ద్వారా రూ.50వేలు, గృహ‌రుణ వ‌డ్డీపై రూ.2ల‌క్ష‌ల దాకా, మొద‌టిసారి ఇంటిని కొనుగోలు చేసిన‌వారికి అద‌నంగా రూ.50వేల రిబేటు.. ఇలా మొత్తంగా రూ.4.5ల‌క్ష‌ల దాకా ప‌న్ను మిన‌హాయింపు పొందే వీలుంది. పైన పేర్కొన్న వాటిలో అన్నింటిలో పెట్టాల‌నేం కాదు. మీ ల‌క్ష్యాలు, పెట్టుబ‌డి వ్య‌వ‌ధి, రిస్క్ తీసుకునే త‌త్వం లాంటివాటిని బ‌ట్టి స‌రైన దాన్ని ఎంచుకోగ‌ల‌రు.

1 comment:

  1. tax consultant in Delhi synmac provide you complete in formation about company registration ,GST filing ,Tax consultants in Delhi
    advantage :low cost. for more details click link below..
    https://synmac.in/companyregistration.php

    https://synmac.in/GST-Registration-Consultants-In-Chennai.php

    ReplyDelete