HTML

HTML2

Thursday, January 16, 2014

కార్యదర్శుల కొలువులకు... మార్గదర్శకాలు!

నిరుద్యోగులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రకటన విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,677 పంచాయత్‌ కార్యదర్శులు (గ్రేడ్‌-4) ఉద్యోగాలు ప్రకటించారు. పోస్టులు జిల్లాల వారీగా పేర్కొన్నప్పటికీ స్థానిక, స్థానికేతర ప్రాతి పదికపై (ప్రతి జిల్లాలో 80% పోస్టులు జిల్లా స్థానికులకు; మిగిలిన 20% పోస్టులు స్థానిక, స్థానికేతరులతో) భర్తీ చేస్తారు.

డిగ్రీ అర్హతతో ఇటీవల మరే ఇతర పోస్టుల ప్రకటనా రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శి పోస్టులకు గట్టి పోటీ ఏర్పడింది. పరిమిత సమయం, కొత్త సిలబస్‌ మొదలైన అంశాల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి సన్నద్ధత తీరుతెన్నులు, మెలకువలు ఇవిగో..

గ్రూప్‌-2 ఉద్యోగాలకు సిద్ధపడి, ఇతర కారణాలతో ఆ ప్రకటన వెలువడకపోవడం; పంచాయతీ కార్యదర్శి పోస్టుపై దృష్టి నిలపడం, 50 రోజుల్లోపే పరీక్షకు సిద్ధపడాల్సి రావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ ఏర్పడింది. పేపర్‌- 1లో రెగ్యులర్‌ జనరల్‌స్టడీస్‌కు భిన్నంగా కొత్త సిలబస్‌ ఇచ్చారు. ఈ తేడాలను గమనించి అభ్యర్థి సన్నద్ధతను ప్రారంభిస్తే సమయం సద్వినియోగమవుతుంది.

ఉద్యోగిగా మారిన తరువాత ఏయే అంశాలైతే విధినిర్వహణలో ఉపయోగపడతాయని భావిస్తున్నారో ఆ అంశాలపై దృష్టిని నిలిపేలా చేయడం ఈ సిలబస్‌లోని కొత్త కోణం. అందువల్ల అటువంటి అనువర్తనాన్ని సన్నద్ధతకు జోడిస్తే ఆశించిన ఫలితం సిద్ధిస్తుంది.

* 'జాతీయ, అంతర్జాతీయ ప్రధాన సంఘటనల'ను విస్తృత పరిధిలో చూడాలి. కేవలం వర్తమానాంశాలతో ముడిపెడితే సరిపోదు. యూఎన్‌ఓ , భారత్‌- ఇతర దేశాల్లో ప్రధాన సంఘటనలు, సార్క్‌, బ్రిక్స్‌ వంటి వాటిలో అనుసంధానం చేసుకోవాలి. జాతీయస్థాయిలో.. భాషాప్రయుక్త రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల మండలి, పార్లమెంటుపై దాడి, ముఖ్యమైన చట్టాలు వంటివి 63 ఏళ్ళ నేపథ్యంలో సమీక్షించుకోవాలి.

* భౌతికశాస్త్ర సంబంధిత సాంకేతికత, జీవశాస్త్ర సంబంధిత సాంకేతికత అని 2 భాగాలుగా S & T అధ్యయనం చేయాలి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో సమాచార సాంకేతికత ప్రాధాన్యం పొందవచ్చు. మీ-సేవ, ఈ-గవర్నెన్స్‌, పీఆర్‌ఐఏ వంటవి బిట్స్‌గా మారవచ్చు.

* ఆధునిక భారతదేశ చరిత్ర అంశాలపై దృష్టి పెడుతూనే ఏపీలో 19, 20 శతాబ్దాల్లో జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజకీయ చారిత్రక అంశాలపై దృష్టి నిలపడం అవసరం.

* విషయ విశ్లేషణ సామర్థ్యం, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నూతన అంశాలూ; పంచాయతీ కార్యదర్శుల విధుల్లో ఉపయోగపడేవి కాబట్టి గణనీయ సంఖ్యలో ప్రశ్నలు అడగవచ్చు. గణాంకాలతో కూడిన పేరాలు ఇచ్చి విషయపర ముగింపులు సాంఖ్యక ముగింపులు అడగవచ్చు. పేరాలు లేకపోయినా 5, 6 లైన్లతో కూడిన సమాచారం ఇచ్చి విశ్లేషణశక్తిని పరిశీలించే ప్రశ్నలు అడగవచ్చు. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ఈ తరహా అంశాలు మొదటిసారి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.

* విపత్తు నిర్వహణ గత 3 సంవత్సరాలుగా పోటీ పరీక్షల్లో ప్రాధాన్యం పొందుతూ వస్తోంది. 5- 15 ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల దీనిపై అనువర్తన కోణంలో దృష్టి నిలపాలి. ముఖ్యంగా సీబీఎస్‌ఈ 8, 9 తరగతుల్లోని సమాచారం చదివితే సరిపోతుంది. అనువాద పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. గతంలో చదివిన జనరల్‌స్టడీస్‌ సరిపోతుందిలే అనుకోకుండా నూతన అంశాల్ని ప్రత్యేక దృష్టితో చదవాలి.
పేపర్‌- 2: గ్రామీణాభివృద్ధి, స్థితిగతులు, సమస్యలు
(ఏపీ ప్రత్యేక కోణంలో)

ప్రజారోగ్యంతో మానవ వనరుల అభివృద్ధి తద్వారా గ్రామీణాభివృద్ధి అనే ఆశయం మొదటి విభాగంలో ప్రతిబింబిస్తుంది. అంటువ్యాధులు, కారణాలు, నియంత్రణ, నిరోధక పద్ధతులు అనే కోణంలో చదవాలి. కొంత జనరల్‌సైన్స్‌లోని అనువర్తనభాగం ఈ అంశం తయారీకి ఉపయోగపడుతుంది. ప్రాథమిక పుస్తకాల్లోని పరిశుభ్రతపై ప్రశ్నలు రావచ్చు.

* అణచివేతకు గురైన వర్గాలు (ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళ) ఎదుర్కొంటున్న సమస్యలు రెండో సిలబస్‌ అంశంగా పేర్కొన్నారు. ఆయా వర్గాల నేపథ్యంలో సామాజిక సంఘర్షణలు, ఉద్రిక్తతలు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాల కోణంలో ప్రశ్నలు రావచ్చు. ముఖ్యంగా శాసన సంబంధిత, వ్యవస్థాపన ఏర్పాట్లపై ప్రశ్నలు రావచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలకు సంబంధించిన జనాభా గణాంకాలు (జిల్లాల వారీగా) అభివృద్ధి పథకాలపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.

* ప్రజాస్వామిక వ్యవస్థలు, పంచాయతీరాజ్‌, సహకార వ్యవస్థలు పేపర్‌-2లో మూడో సిలబస్‌ అంశంగా పేర్కొన్నారు. 20 నుంచి 25 ప్రశ్నలు ఆశించవచ్చు. ముఖ్యంగా ఏపీలో పంచాయతీరాజ్‌ పరిణామం, స్థిరీకరించిన విధానం ఎక్కువ ప్రాముఖ్యం పొందవచ్చు. శాసన, ఎన్నికల వ్యవస్థలు, ఇతర రాజ్యాంగ అంశాలపై ప్రశ్నలు అధికంగా రావచ్చు.

* గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణాభివృద్ధిపై కూడా 30- 35 ప్రశ్నలు అడిగే అవకాశముంది. అభివృద్ధి పథకాలు ప్రధానాంశాలు. 1952 నుంచి తాజా గ్రామీణాభివృద్ధి పథకాలపై ప్రాథమిక భావనలు అవసరం. ఏపీ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు ఎక్కువగా రావచ్చు. తాజా పథకాలు కొంత గణాంక సమాచారం ఆధారంగా చదవాలి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కింద వ్యవసాయం, వ్యవసాయ సంబంధ అంశాలు ప్రశ్నలకు ఆధారంగా ఉంటాయి. ఏపీ ఎకనామిక్‌ సర్వే ఆధారంగా ఈ అంశాలు చదవడం ప్రయోజనకరం. గ్రామీణ నిరుద్యోగం- ప్రత్యామ్నాయ మార్గాలను సైద్ధాంతికంగా కాకుండా ఆంధ్రప్రదేశ్‌ అనువర్తనంలో చదవాలి. కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల విస్తరణ, అటవీ వ్యవస్థలకు కూడా ప్రాధాన్యం ఉంది. ఏపీ ఎకనామిక్‌ జాగ్రఫీని అనుసంధానించుకోవడం మేలు.
అకౌంటింగ్‌ మౌలిక అంశాలు- ఐదో విభాగం. 30 ప్రశ్నల వరకు ఖాతాల తయారీ, నిర్వహణపై అడిగే అవకాశముంది. పంచాయతీ కార్యదర్శికి పంచాయతీల ఖాతాల నిర్వహణ బాధ్యత ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ ఖాతాల నిర్వహణపై దృష్టి సారించాలి. పంచాయతీ వ్యవస్థలో ఉపయోగిస్తున్న పీఆర్‌ఐఏ సాఫ్ట్‌వేర్‌ ప్రాథమిక సమాచారం ఉండాలి.

మీరు గ్రూప్స్‌ ఆశావహులా?

గ్రూప్‌- 2, 1, ఇతర పరీక్షల నిర్వహణ గురించి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఈ అభ్యర్థులు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సిద్ధపడుతున్నారు. అటువంటివారు ....

* పట్టికలో పేర్కొన్న రీతిలో పాత, కొత్త జనరల్‌స్టడీస్‌ల మధ్య తేడాలు గమనించి సిద్ధమవాలి.

* ఆర్థిక వ్యవస్థ అంశాల కోసం గ్రూప్స్‌ స్థాయి సన్నద్ధత ఎక్కువవుతుంది. ఉద్యోగస్థాయి దృష్ట్యా మౌలిక, ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే చాలు. గ్రూప్స్‌ స్థాయిలో లోతుగా సన్నద్ధమవడం సమయం వృథా!

* 'ఖాతాల'కు సంబంధించిన అంశాలు గతంలో ఎక్కడా చదివివుండరు. అందుకని వీటిపై సమయం వెచ్చించాలి.
* 'అణగారిన వర్గాల సమస్యల'పై గట్టి పట్టు సాధించాలి. రాజకీయ రాజ్యాంగ, వ్యవస్థాపరమైన, సామాజికపరమైన
ఏర్పాట్లు అనే కోణంలో విస్తృతంగా చదవడం మంచిది.

పంచాయతీ సెక్రటరీ- గ్రేడ్‌- 4 ఉద్యోగంలో చేరినవారు అంచెలంచెలుగా గ్రేడ్‌-3, గ్రేడ్‌-2, ఆపై గ్రేడ్‌-1 పంచాయతీ సెక్రటరీలుగా పదోన్నతులు పొంది గ్రామీణాభివృద్ధి విస్తరణ అధికారి ఈఓఆర్‌డీగా, చివరగా ఎంపీడీవో వరకు పదోన్నతులు పొందవచ్చు. పంచాయతీ కార్యదర్శి ప్రధాన విధి గ్రామ పంచాయతీ నిర్ణయాలను, విధానాలను అమలుచేయడం. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం రాజ్యాంగంలోని 11వ షెడ్యూలులో చేర్చిన 29 రకాల విధులను గ్రామపంచాయతీ పర్యవేక్షణలో నిర్వర్తించవలసి ఉంటుంది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం- 1994లో నిర్దేశించిన పంచాయతీ విధులన్నింటినీ కార్యదర్శి నిర్వహించాల్సి ఉంటుంది.
కార్యదర్శి సర్పంచి ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేస్తారు. వాటికి ఓటుహక్కు లేకుండా హాజరవుతారు. పంచాయతీ ఉద్యోగులపై పర్యవేక్షణ అధికారాలుంటాయి. ఇంటిపన్ను, కొలగారము/ కాటా రుసుం, వ్యవసాయేతర భూములపై సెస్సు వసూలు చేస్తారు. స్థిరాస్తి బదిలీపై విధించే పన్నులో వాటా మొదలైనవాటిని వసూలు చేయాల్సి ఉంది. ఇక పంచాయతీకి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను తయారుచేసి పంచాయతీ ఆమోదానికి నివేదించాల్సి ఉంటుంది. గ్రామంలోని చెరువులు, ఇతర నీటివనరుల, మురుగునీటి కాల్వల నిర్వహణ, గ్రామంలోని వీధిదీపాలు, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, గ్రామపంచాయతీ ఆదాయ వ్యయాల నిర్వహణ మొదలైనవి విధులు.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తును పంపడానికి అభ్యర్థులందరూ దరఖాస్తును ప్రాసెస్‌ చేయడానికి రూ. 100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ రుసుమును అన్ని వర్గాల అభ్యర్థులూ చెల్లించాల్సిందే. ఆ తర్వాత రిజర్వేషన్‌ సౌకర్యంలేనివారు మాత్రం రూ.80ను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ జనవరి 22 తేదీ. అయినా ఫీజు చెల్లించడానికి గడువు జనవరి 20 అయినందున దానినే చివరి తేదీగా భావించాలి. కాబట్టి ఆఖరి తేదీ వరకూ వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తును పంపడం ఉత్తమం.

విద్యార్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దూరవిద్య ద్వారా డిగ్రీ పొందినవారు కూడా అర్హులే. అయితే ఆ యూనివర్సిటీ డీఈసీ/ యూజీసీ/ ఇగ్నో గుర్తింపు పొందాల్సి ఉంటుంది.

వయః పరిమితి: 1 జులై, 2013 నాటికి 18 నుంచి 36 సంవత్సరాలు. గరిష్ఠ వయః పరిమితి సడలింపు ఎస్‌సీ/ ఎస్‌టీ/ బీసీలకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసుకు లోబడి 5 సంవత్సరాలు, ఎక్స్‌సర్వీస్‌ మెన్‌ సర్వీసు కాలం, 3 సంవత్సరాలు అదనంగా జనగణన శాఖలో కనీసం 6 నెలలు పనిచేసి తొలగించిన అభ్యర్థులు 3 సంవత్సరాలు. ఈ ఉద్యోగాలన్నీ రిజర్వేషన్‌ నియమాలకు లోబడి భర్తీ చేస్తారు.

-eenadupratiba.com

No comments:

Post a Comment